Tuesday 2 October 2012



!! స్మరాంజలి !!


స్వాతంత్రం అంటే ??!!!

చదువు ని నిర్లక్ష్యం చేసినా అరవకూడదు  - అంటుంది బాల్యం !
అర్ధరాత్రి ఫోన్లనూ, సమయము లేని వ్యాపకాలను ప్రశ్నించకూడదూ  - అంటుంది యవ్వనం !
ఇతరుల ఇబ్బందులతో నాకు పని లేదు - అంటుంది నలభైల లోని నాలుక !
అది చెయ్, ఇది చెయ్ అని అనటం నా హక్కు - అంటుంది అరవైలో పడిన అర్ధ జీవితం !
కాని అంటూ ఏదైనా చెప్పబోతే,
" గాంథీ " అనే పేరే వినిపించని, గజిబిజి ల బిజీ కాలం - అంటుంది మానవత్వం !
మరి గాంథీ గారు తెచ్చిన స్వతంత్రం ?? -  కేవలం ఒక సేవ యేనా !!
పరాయి పాలనా విముక్తి ?? - ఒక సహాయమేనా !!
అహింసా, సత్యాగ్రహాల ప్రతి ఫలం ?? - ఇక వ్యర్ధమేనా !!.
మరి స్వాతంత్రానికి అర్ధం ??
బానిస బాధల ఆక్రందనలు, స్వేఛ్చా వాయువుల పరిమళాలు ...
అని సగర్వం గా చెబుతుంది అప్పటి భరతావని,
కాని నిస్సహాయం గా, నిర్లిప్తం గా, నిర్వీర్యం గా చూస్తుంది ఇప్పటి " ఇండియా ".
స్వతంత్రం అంటే స్వయంప్రతిపత్తి కాదు,
ఐక్యత తో చేసే సహజీవనం,
నీతి, నిజాయితీల మీద నమ్మకం,
కాదు అవినీతి, అన్యాయాల స్నేహం,
కావాలి సర్వమానవ సౌభ్రాత్రుత్వం.
అందుకు అందరిని గాంథీ లు గా కాదు నిలపటం ,
నింపాలి అందరి లోను గాంధీలను.
మరి మహాత్ముని స్మరించటం ??
విగ్రహాల, చిత్రపటాల పూజల తో కాదు......బాపు ఒక్క సూక్తి తో అయినా జీవన కాల సహచర్యం !!!


Thursday 22 March 2012

అందమైన ఓ నందనమా ...ఖర ను అనుకరించకుమా


న మైన ఓ 'ఖర' నామ వత్సరమా ...
మా వీడుకోల వందనాలు అందుకొనుమా....
అన్నదాతల ఆయువులతో వుయ్యలలూగిన వురి తాళ్ళు ఐనా ,
విడిపోదాం రాష్ట్రము తో అంటూ కలిసుండి కలతలు కలహాలు సృష్టించినా ,
ఆ సృష్టి భారం భరింపక చాలించిన తనువులెన్ని ఐనా ,
తప్పక భరిస్తూ తల్లాడిన మిగిలిన తనువులు ఐనా ,
వాగ్దానాల తనిఖీ తో పొందిన అందలాల రుచిని ఇంకా ఆస్వాదిస్తూ ..
ప్రజా అనే పదాన్ని అప్పుడప్పుడు స్మరించే రాజకీయ వర్తకులైనా ,
మేమింత  , మా ఘనమింతా...వారెంత , వారిది మోసమంతా
అంటూ గురువింద చందాన పలికిన పార్టీల  ప్రగల్భాలైనా ,
ఆకాశాన్ని ఎపుడో దాటి విశ్వం లోకి దూసుకు వెళ్ళిన ధరల క్షిపణులైనా ,
ప్రతి ఏటా విధి తప్పక పలుకరించే ,
' నీటి బాధలూ ,అనారోగ్య ఆరోగ్యాలు ,నిరుద్యోగ నిష్ణాతులు , ఆకలి చూపులు' ఇత్యాదులు ఎన్నైనా ,
సమాజం ,సాంఘీకం వృద్ధి లోకి పరుగిడుతున్నా 
వనితల చేతులు వొదలని వంకర బుద్ధులైనా ,
వొహ్ ...
లోతుల్లోకి వెళ్ళే కొద్దీ తెలిసే ఇలాంటి లోపాలు ఇంకెన్నైన...
నీ వందించిన మచ్చ లేని, మాసి పోని గురుతుల బాన్ఢమే.
అవినీతి వేళ్ళను కదిపిన యువత శక్తి ఐనా ,
రాజకీయ స్వాహాల్లోని హహాకరాలను వినిపింప చేసిన సామాన్య యుక్తి ఐనా ,
పాప భీతి కో,పుణ్య రాశి కో ఆహ అనిపించుకున్న ఆలయాల ఆర్జనలైనా ,
అంచనాలు చేరిన మానసిక ఉల్లాస క్రీడలైనా...
చిరు జీవితాలు చినబోకుండా నీవు కురిపించిన చిరు జల్లులే . 
 ఓ ఘన మైన 'ఖర'  వత్సరమా ...
మూగబోయిన మందహాసాలతో , విరిసి విరియని దరహాసలతో,
వేడుకోలుగా నీకు  వీడుకోలు పలుకుతూ .....
అందమైన ఓ నందనమా !
ప్రతి జీవన గమ్యపు మధురిమవై ,
ఆనందపు జల్లుల జడివానవై ,
శాంతి భద్రతల సమన్వయివై ,
మండే ప్రకృతి హిమ లేపనివై ,
నందన వన తలంపుకి నమ్మికవవుతావని ...
నిను స్వాగతిస్తూ ,
మా ఆశల తోరణాల వందనాలు . 





Thursday 5 January 2012

కలల తీరం


   అలలు... తీరం తాకాలని ,

             నా కలలు...నీ హృదయం  చేరాలని,

   కలల అలలు నిజమైతే........

           తీరాలు మాయమౌతాయి .















పాదం పలుకునా...


    మౌనమే మాటలాయే, నీ తలపుల చర్చల్లో .....

              చూపులే చేతలాయే , నిను చూసిన సందడిలో.... 

   అధరాలే మూగబోయే , నీ నవ్వుల పదనిసలో....

              చిరునవ్వే వీడదాయే , నీ మాటల మధురిమలో...

   పాదమే పలుకదాయే , నువు నడవని దారుల్లో.








ప్రకృతి తో ....

   గాలి పాట ... గడ్డి పూల ఆటా,

   కొమ్మల సై ఆట ....... పువ్వుల విరి తోట ,

   పుడమి తల్లి నీళ్ళ  ఆట.......ప్రకృతి ఆడే పాత ఆట.

   కాని ,

   చూపుల దొంగాట ' నీ -నా ' లకు కొత్త ఆట.